వైవీ సుబ్బారెడ్డి. మొన్నటి వరకు వైసీపీలో కీలక నేత. ప్రకాశం జిల్లా వైసీపీలో గ్రూపులు, మారిన వ్యూహాలతో ప్రస్తుతం మౌనం దాల్చారు. మాజీ ఎంపీ రాజకీయ పయనంపై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 2014లో ఎంపీగా విజయం సాధించి, జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన వైవీకి, వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉంది. మాజీ సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి సతీమణి సొంత అక్కా చెల్లెళ్లు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా.. వైవీ సోదరిని వివాహం చేసుకున్నారు. కానీ, 2019లో ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం, వైవీ త్యాగం చేయాల్సి వచ్చింది.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేనితో రాజకీయ విభేదాలకు తోడు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరడంతో, జగన్ ఒంగోలు ఎంపీ స్థానం వైవీకి ఇవ్వలేదు. దీంతో అసంతృప్తికి గురైన వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీ ఇస్తానని వైవీకి సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. కానీ, తనకు ఆసక్తి లేదని వైవీ సుబ్బారెడ్డి అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి చక్కబెడుతున్నారు. ఆయనకు మరొకరిని పోటీగా దించటం కన్నా, వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రస్థాయిలోనే మంచి పదవిని ఇచ్చి రాష్ట్ర వ్యవహారాల్లోనే వినియోగించుకోవాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా టీటీడీ పదవి ఇచ్చే విషయంపై వైవీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. టీటీడీ పాలక మండలిని 2,3 రోజుల్లో రద్దుచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో టీటీడీకి కొత్త పాలకమండలిని వేసే అవకాశం కూడా ఉన్నందున వైవీ సుబ్బారెడ్డి పేరును పరిశీలిస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
వైవీ సుబ్బారెడ్డి అనుచరులైతే టీటీడీ చైర్మన్ పదవి సుబ్బారెడ్డికి దక్కడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైవీ కూడా అందుకు అంగీకరించవచ్చని భావిస్తున్నారు. వైవీ టీటీడీ చైర్మన్‌గా వెళ్లిపోతే ప్రకాశం జిల్లాలో బాలినేనికి కూడా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో జగన్ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.మరోవైపు.. వైవీ గతంలో రాజ్యసభ ఎంపీగా వెళ్లడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత తాను రాజకీయాల్లో ఉండేది? లేనిది? స్పష్టం చేస్తానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన కూడా ఉందని, తనకు టికెట్ రాకపోయిన సమయంలో వైవీ తెలిపారు.