స్పీకర్ గా అంబటి కంఫర్మ్ చేసిన జగన్ – YSRCP Leader Ambati Rambabu confirmed as AP assembly Speaker?

0
536

తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టేసింది. తొమ్మిదేళ్ల పాటు కష్టపడ్డ జగన్ నవ్యాంధ్రకు నూతన ముఖ్యమంత్రి గానూ ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో ఆయన తన కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ తర్వాత వెంటనే కేబినెట్ భేటీ – ఆ వెను వెంటనే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.

సభ్యులంతా ప్రమాణం చేసేదాకా ప్రోటెం స్పీకర్ గా ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తారు గానీ ఐదేళ్ల పాటు స్పీకర్ గా కొనసాగే నేత ఎవరన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ అయితే ఈ చర్చలను అంతగా పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుపోతున్నారు. మరి స్పీకర్ గా ఆయన మనసులో ఎవరున్నారన్న దానిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. ఒకరేమో బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి అంటే మరికొందరేమో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఇంకొందరేమో ఆనం రామనారాయణ రెడ్డి అంటున్నారు.

ఇక తాజాగా ఈ జాబితాలోకి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ముచ్చెమటలు పట్టించిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి చేరారు. అయినా విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడే స్వభావమున్న అంబటి స్పీకర్ పదవికి సరిపోతారా? అంటే వ్యవహారం అంతా తెలిసిన అంబటి సరిపోరని ఎందుకనుకుంటున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎప్పుడెలా వ్యవహరించాలో అప్పటికప్పుడు వ్యూహం రచించుకోవడంలో అంబటి దిట్టేనని చెప్పాలి.

విపక్షాలు విరుచుకుపడితే వాటిని తనదైన మాట తీరుతో ఎలా తిప్పికొట్టాలో – అసలు విపక్షాల విమర్శలకు సరైన సెటైర్లు సంధించడం అంబటికి వెన్నతో పెట్టిన విద్య. అంతేనా ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో కాపులు చాలా మందే ఉన్నారు. కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన చాలా మంది కాపులు వైసీపీ ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వారిలో ఇప్పటికే పలువురికి మంత్రి పదవులను కూడా జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తన సొంత సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం మొత్తానికి మంత్రి పదవులు కేటాయించడం జగన్ కు అసాధ్యమేనని చెప్పాలి.

ఈ క్రమంలో పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ జగన్ కు వెన్నంటి నడుస్తూనే జగన్ పక్షాన వైరి వర్గాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన అంబటికి మంత్రి పదవి లేదని చెప్పడం దుస్సాధ్యమే. మరి పదవి దక్కినా, అవకాశం దక్కకపోయినా పార్టీకి విధేయుడిగానే ఉంటున్న అంబటికి మంత్రి పదవి ఇవ్వకున్నా పెద్ద సమస్య రాదు. అయితే అంబటికి అవకాశం ఇవ్వకుంటే పార్టీని నమ్ముకుంటూ వస్తున్న వారికి ప్రమాద సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదు. మరి ఏం చేయాలి? స్పీకర్ గా చేసేస్తే సరిపోెతుంది కదా. అందులోనూ మాజీ స్పీకర్ కోడెలను తొడగొట్టి మరీ ఓడించిన అంబటికి స్పీకర్ పదవిని గిప్ట్ గా ఇచ్చినట్టే కదా. ఇదీ వైసీపీ లెక్క. మరి ఈ లెక్కకు అంబటి ఏమంటారో? అసలు జగన్ మనసులో ఏముందో చూడాలి కదా. ఏది ఏమైనా స్పీకర్ గా అంబటికెే అధిక అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here