ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వైసీపీ నేత, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఎంపిక దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డిని, లోక్‌సభ పక్ష నేతగా మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ను నియమించిన జగన్ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడుని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సివుంది.
12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే అంతకు ముందే మంత్రివర్గం ఏర్పడనుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మిగిలివున్న 9 నెలల కాలానికీ కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ను సమర్పిస్తారు. తొలి సమావేశాల్లోనే బడ్జెట్ ఉంటుందా లేక కొన్ని రోజుల విరామం తర్వాతనా అనేది త్వరలోనే తేలిపోనుంది.
విజయనగరం జిల్లాకు చెందిన చిన అప్పలనాయుడు 1983, 1985, 1994లలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో బొబ్బిలి నుంచి వైసీపీ తరపున విజయం సాధించారు.