ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఎవరికి వారు తమకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి పదవి జగన్ కేబినెట్‌లో ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఐటీ మంత్రిగా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన విడదల రజనీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
విద్యాధికారురాలు కావడం, అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం చేయడం వంటి అంశాలతో పాటు బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసొచ్చే అంశమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీకి ప్రపంచంలోని వెయ్యికి కంపెనీల సీఈవోలతో సత్సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఐటీ రంగంలో వ్యాపారం చేసిన అనుభవం కూడా రజనీ సొంతం. ఆమె చొరవతో రాష్ట్రానికి 200 ఐటీ కంపెనీలు తీసుకురాగల సామర్థ్యం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీలో ఆశించిన స్థాయిలో ఐటీ అభివృద్ధి జరగాలంటే, ప్రపంచస్థాయి కంపెనీలను ఇక్కడికి తీసుకురావడం ఒక్కటే మార్గమని నిపుణలు భావిస్తున్నారు.
శాఖల కేటాయింపు విషయంలో వ్యక్తుల సామర్థ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని జగన్ మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఐటీ మంత్రిగా ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. అయితే ఇదే నియోజకవర్గంలో తాను పోటీ చేసే అవకాశాన్ని వదులుకున్న మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సమయంలోనే హామీ ఇచ్చారు. దీంతో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు దక్కుతాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఐటీ శాఖ మంత్రిగా కాకపోయినా, ఆమెకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చి రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధికి ఆమె సేవలను జగన్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.