వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తిరుపతి వైసిపి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కొద్ది అతి తక్కువ మెజారిటీతో బయటపడిన కరుణ ఈ సమయంలో ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భూమన అత్యంత సన్నిహితుల్లో ఒకరన్న విషయం తెలిసిందే. అందుకే తిరుపతిలో టికెట్ కోసం పెద్దగా ఎవరూ ప్రయత్నాలు కూడా చేయలేదు. అందుకనే జగన్ కూడా భూమనకే టికెట్ కేటాయించేశారు. టికెట్ అయితే దక్కించుకున్నారు కానీ గెలుపు మాత్రం అంత ఈజీగా దక్కలేదు. ఎందుకంటే, భూమనపై జనాల్లోను పార్టీ నేతల్లో కూడా బాగా వ్యతిరేకతుంది. సరే ఎన్ని వ్యతిరేకతలున్నా జగన్ మాత్రం భూమనకే టికెట్ ఇచ్చారు. దాంతో గెలుపు కోసం భూమన నానా అవస్తలు పడ్డారు.
భూమన గెలుపుకు పార్టీ నేతలు పెద్దగా సహకరించలేదని చెప్పటానికి ఆయనకు వచ్చిన మెజారిటీనే సాక్ష్యం. టిడిపి అభ్యర్ధి సుగుణమ్మ పై భూమన గెలిచింది కేవలం 780 ఓట్ల మెజారిటితో మాత్రమే. సుగుణమ్మపై కూడా జనాల్లోను, పార్టీలోను చాలా వ్యతిరేకతే ఉన్నా భూమన మాత్రం గెలుపుకు చాలా కఫ్టపడాల్సొచ్చింది. ఈ నేపధ్యంలోనే శనివారం జరగబోయే మంత్రివర్గ విస్తరణ ముందు భూమన ఈ ప్రకటన చేయటం వెనుక ఏదైనా మైండ్ గేమ్ ఉందా అని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెబితే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భూమన ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.






